షెఫాలీ జరివాలా, 42 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చనిపోయేంత వయసు కాదు, చిన్నపాటి సమస్యలు తప్ప ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు.
ప్రస్తుతం పోలీస్ విచారణలో దొరికిన కీలకమైన క్లూ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్.
యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు కొందరు తరచుగా ఉపయోగించే ఇంజెక్షన్లు. వయసు తెలియకుండా, యవ్వనంగా కనిపించేందుకు వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడతారు. షెఫాలీ కూడా గత ఎనిమిదేళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని బాలీవుడ్ వార్తలు చెబుతున్నాయి. డాక్టర్ సలహాతో నెలవారీగా తీసుకుంటారని తెలుస్తోంది. జూన్ 27న కూడా ఆమె ఈ ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే, ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోయారని తెలుస్తోంది. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయింది. విచారణలో భాగంగా షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరికాయి. ఆమె ఉపవాసంతో ఉన్న సమయంలో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు.
సాధారణంగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. చర్మం రంగును మెరుగుపరుచుకోవడం కోసం, ముడతలను తగ్గించడం కోసం కొందరు వీటిని తరచూ తీసుకుంటారు. అయితే, ఈ ఇంజెక్షన్లు గుండె సమస్యలు, ఎపిలెప్సీ వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షెఫాలీ జరివాలా కేసులో కూడా ఇదే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె ఉపవాసం ఆచరిస్తూ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు ఇతర మందులతో కలిసినప్పుడు, లేదా ఉపవాసం లాంటి దీక్షల్లో తీసుకున్నప్పుడు ఆరోగ్యం మరింత ప్రమాదకరంగా మారవచ్చని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. షెఫాలీ ఇంట్లో స్వాధీనం చేసుకున్న మందుల్లో యాంటీ ఏజింగ్ వైల్స్తో పాటు విటమిన్, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరికాయి. బహుశా వీటి ప్రభావంతోనే చనిపోయి ఉండొచ్చు. పోస్ట్మార్టం, ల్యాబ్ రిపోర్టులు వస్తే ఆమె మరణానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
చాలా దేశాల్లో ఈ ఇంజెక్షన్లు కఠినమైన నియమాల కింద లభిస్తాయి, కానీ మన దేశంలో నియంత్రణ సరిగా లేకపోవడంతో సులభంగా అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఈ ఇంజెక్షన్లను నియంత్రించాలని, వైద్య సలహా లేకుండా వాడకూడదని డిమాండ్ చేస్తున్నారు.
