కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కలకలం రేపుతోంది.
ముఖ్యంగా ఏపీలో, కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల మరో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక మహిళకు పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చిలకలూరిపేటకు చెందిన వృద్ధుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు పాజిటివ్ అని తేలింది.
గుంటూరు జిల్లాలో కరోనావైరస్ సోకిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వారిని ఇంటికి పంపించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముగ్గురికి కరోనా సోకినట్లు ఆసుపత్రి వైద్యులు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేశారు. తాజా కేసులతో ఏపీలో కేసుల సంఖ్య దాదాపు 10కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటడం కలకలం రేపుతోంది. కేరళలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలలో కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.
