హైదరాబాద్, జూలై 1: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్లో బోర్డు మొదట పేర్కొనలేదు. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం RRB రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పరీక్ష జులై 15వ తేదీన ఆన్లైన్ విధానంలో దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో జరగనుంది.
పరీక్షకు పది రోజుల ముందుగా సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేస్తారు. ఆ తర్వాత, పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ సూచనలు పాటించాలని బోర్డు తెలిపింది. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.. వంటి రైల్వే రీజియన్లలో భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష తర్వాత వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
