హాలీవుడ్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.. ‘బ్యాట్‌మ్యాన్’ ఇక లేరు!
హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. టాప్ గన్, బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో యావత్ సినీ ప్రపంచాన్ని అలరించిన హాలీవుడ్ హీరో వాల్ కిల్మర్ (65) కన్నుమూశారు.
కొంతకాలంగా గొంతు క్యాన్సర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 1న లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1980లు మరియు 90లలో తన నటనతో కిల్మర్ అందరినీ ఆకట్టుకున్నాడు.
1986లో విడుదలైన టాప్ గన్ చిత్రం వాల్ కిల్మర్‌కు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘టాప్ గన్’లో ఐస్‌మ్యాన్, ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్’లో బ్యాట్‌మ్యాన్, ‘ది డోర్స్’లో జిమ్ మోరిసన్ వంటి పాత్రలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కిల్మర్ టూంబ్‌స్టోన్ (1993), ట్రూ రొమాన్స్ (1993), హీట్ (1995), మరియు ది గోస్ట్ అండ్ ది డార్క్‌నెస్ (1996) చిత్రాలలో కూడా నటించారు. అతని చివరి చిత్రం, టాప్ గన్ మావెరిక్, 2022లో విడుదలై విజయవంతమైంది. ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ వంటి యానిమేటెడ్ చిత్రాలకు అతను వాయిస్ ఓవర్లు అందించాడు.
కిల్మర్ వ్యక్తిగత జీవితం… అతని పూర్తి పేరు వాల్ ఎడ్వర్డ్ కిల్మర్. అతను డిసెంబర్ 31, 1959న లాస్ ఏంజిల్స్‌లో జన్మించాడు. అతను తన బాల్యాన్ని చాట్స్‌వర్త్‌లో గడిపాడు. అతను 1988లో తోటి నటి జోవాన్ వాలీని వివాహం చేసుకున్నాడు. వారికి మెర్సిడెస్ అనే కుమార్తె మరియు జాక్ అనే కుమారుడు ఉన్నారు. అభిప్రాయ భేదాల కారణంగా వారు 1996లో విడాకులు తీసుకున్నారు.