జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు: పాన్ కార్డ్ నుంచి రైలు టికెట్ వరకు కీలక మార్పులు!
దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. జూలై 1 (మంగళవారం) నుంచి పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాన్ కార్డ్, బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ వర్తిస్తాయి.
పాన్ కార్డ్ నుంచి రైలు టికెట్ వరకు అమలయ్యే కొత్త నిబంధనలపై ఓ లుక్కేయండి:
రైలు టికెట్ ధరలు, నిబంధనలలో మార్పులు
ప్రధానంగా, నేటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరగనున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ క్లాస్ చార్జీలను పెంచనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాన్-ఏసీ కేటగిరీలలో టికెట్‌పై కిలోమీటర్‌కు ఒక పైసా, థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీ వరకు అన్ని క్లాస్‌లలో కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగుతాయి. ఇందులోనూ దూరాన్ని బట్టి టికెట్ రేట్లలో మార్పులు ఉంటాయి.
అలాగే, తత్కాల్ టికెట్ల బుకింగ్‌ను కఠినతరం చేశారు. ఇకపై తత్కాల్ టికెట్లు ఐఆర్సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసిన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు, ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి చేసింది.
పాన్ కార్డు, ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు
పాన్ కార్డుల రూల్స్ సైతం మారబోతున్నాయి. కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి అంటోంది. ఇప్పటికే పాన్, ఆధార్ కార్డులు ఉంటే, వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని లింక్ చేసుకునేందుకు డిసెంబర్ 31, 2025 వరకు అనుమతి ఇచ్చింది.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2025. ఈ క్రమంలో CBDT దాని గడువును పొడిగించింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 15, 2025ని చివరి తేదీగా ప్రకటించారు.
బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, గ్యాస్ సిలిండర్ నిబంధనలు
అన్ని రకాల క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు కోసం కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారానే అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
బ్యాంక్ ఏటీఎం, యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించనున్నారు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఏటీఎం రూల్స్‌లో మార్పులు చేశాయి. నెలలో ఐదుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్‌డ్రాకి అవకాశం ఇచ్చింది.
అలాగే, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ₹10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే క్రెడిట్ కార్డులపై ఒక్క శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ ధరల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు వంట గ్యాస్‌తోపాటు వాణిజ్య సిలిండర్ ధరలపైనా ప్రభావం చూపవచ్చు. వాణిజ్య గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది.
